హలో "బ్లాగు"న్నారా? - ఆంధ్రభూమి ఆదివారం "మెరుపు" లో....

శ్రీ రామతీర్థ గారూ ఆంధ్రభూమి ఆదివారం సిటీ ఎడిషన్ "సెంటర్ స్ప్రెడ్" లో నిర్వహిస్తున్న "మెరుపు" లో
తేది 10 ఏప్రెల్ 2011 నాడు నా వెబ్ సైట్ మరియు బ్లాగ్ కోసం శ్రీమతి జగద్ధాత్రి గారూ ఎంతో హాస్యంగా రాసిన ఆర్టికల్.
శ్రీ రామతీర్థ గారికి, జగద్ధాత్రి గారికి మరియు ప్రచురించిన ఆంధ్రభూమి "మెరుపు" సంపాదకులకు ధన్యవాదములు.

ఫేస్ బుక్ లో ఒక నాటి నా కలం స్నేహితుడు ప్రేమ స్వరూప్

ఈ రోజు నా పుట్టినరోజు....
ముప్పై ఏళ్ళ క్రితం నా కాలేజీ రోజులలో కలం స్నేహం తో పరిచయమై విశాఖపట్నం లోనే నివాసం ఉంటున్న మిత్రుడు ప్రేమ స్వరూప్ ని ఫేస్ బుక్ లో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
అప్పటి ప్రేమ స్వరూప్  ఫోటో

అప్పటి నా ఫోటో 

ధన్యవాదములు మిత్రమా..మనం కలసి ఇరవై ఏడు ఏల్లైనా ఈ కలం స్నేహితుణ్ణి మరిచిపోకుండా గుర్తుంచుకుని ఓప్పిగ్గా ఫేస్ బుక్ లో వెదికి పట్టుకున్నందుకు. 

మా ఇద్దరి కలం స్నేహం గురించి చెప్పడానికి చాలావుంది. చదవండి... నేపధ్యం చాల ఉత్కంటగా కూడా వుంటుంది.

అది 1980వ సంవత్సరం అనుకుంటాను.
మిత్రులు ప్రేమ స్వరూప్ వివరాలు "కలం స్నేహితులు " శీర్షికన ఏ పత్రికలో వచ్చిందో గుర్తులేదు. 
ల్యాండ్ లైన్స్ మరియు  సెల్ ఫోన్లు వాడకం లో లేని రోజులలో పత్రికల లో వచ్చే "కలం స్నేహితులు" శీర్షికల ద్వారా ఇద్దరు అపరిచితుల మధ్య వుత్తరపత్యుత్తరాల ద్వారా   స్నేహాలు కొనసాగేవి. అప్పట్లో వచ్చే ప్రతి పత్రికలోను "కలం స్నేహితులు" శీర్షికకు ఒక కాలమ్ విది గా వుండేది. 

ఆ రోజులలో ప్రతి కాలేజీ స్టూడెంట్ చేతులలో క్లాసు పుస్తకాలతో పాటు వార/మాస పత్రికలు కూడా తప్పకుండా ఉండేవి. నాకు బాగా గుర్తు...కాలేజీ ఐపోయినాక బస్సులలో కొంచెం దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే నా క్లాసు అమ్మాయిలు బస్సులో టైం పాసు కోసం బుక్ స్టాల్స్ నుండి ఆ వారం పత్రికలను కొనుక్కుని బస్సు ఎక్కేవారు. ప్రతి అమ్మాయి చేతిలో ఓ పత్రిక కనిపించేది. 

కలం స్నేహితుల శీర్షికలో మిత్రుడు పేరు "ప్రేమ స్వరూపా"  అని వుంటే అమ్మాయే ఐఉంటుందని భ్రమించి స్నేహం కోరుతూ వుత్తరం వ్రాసాను. ఉత్తరానికి బదులు వచ్చింది. ఆ వయసులో మనసు ఓ పెద్ద కోతి. ముందు వెనుక ఏమవుతుందో మనం ఎటు వెళ్తున్నామో తెలియని అయోమయపు పరిస్థితి.

కొన్ని రోజులు మా ఇద్దరి మధ్య ఓ "అమ్మాయీ -అబ్బాయీ" ల మధ్య సాగాల్సిన వుత్తరపత్యుత్తరాలే సాగాయి. మిత్రుడు  ప్రేమ స్వరూప్ కూడా "తమాషా ఏమిటో చూద్దాం" అన్నట్లుగా వెంటనే తను ఓ అబ్బాయినే అన్న విషయం బయటపెట్టలేదు. ప్రేమ్ నాకు పంపే ఫొటోస్ మీద కూడా నన్ను కవ్వించేలా "స్వరూపా" అని తెలుగులో వ్రాసేవాడు. ఉదాహరణకు ఈ క్రింది ఫోటో చూడండి. అలా రాస్తే మరి నేనేమనుకోవాలి?

ఇటువంటి ఫోటోలు ప్రేమ్ నాకు చాల పంపించాడు. అయితే ప్రేమ స్వరూప్ తను అమ్మాయి ని కాదు అబ్బాయినే అన్న విషయం ఎక్కువ రోజులు దాచి ఉంచకుండా కొద్ది నెలలలోనే బయటపెట్టి నాకు చాల క్షోభకు గురిచేశాడు.
నిజం తెలిసాక ఓ రోజు ప్రేమ్ నేను ముఖాముఖి కలుసుకుని విశాఖపట్నం లో (ప్రాంతం గుర్తులేదు) వున్నావాళ్ళ ఇంటికి వెళ్ళాము.

ఆ తరువాత నేను 1982 లో వాయుసేన లో భర్తీ ఐపోయాను. నేను బెంగుళూరు  ట్రైనింగ్ లో వున్నప్పుడు మరియు ఎయిర్ ఫోర్సు స్టేషన్ న్యూఢిల్లీ లో నివాసం వున్నప్పుడు ప్రేమ స్వరూప్ ఎన్నో ఉత్తరాలు వ్రాసాడు. ప్రతి ఉత్తరానికి ఓ ఫోటోగ్రాఫ్ జత చేయడం అతని ప్రత్యేకత. ప్రేమ్ కు అరుకు అందాలంటే చాల ఇష్ట్టం అనుకుంటాను. ఆయన తీసుకున్న చాల ఫొటోస్ లో అరుకు అందాలు వుంటాయి.

ప్రేమ స్వరూప్ ఉత్తరాలతో పాటు జత చేసి నాకు పంపిన కొన్ని ఫోటోలు మరియు వాటి వెనుక వ్రాసిన ఆయన భావాలు : 






పై అన్నింటికంటే మరో గొప్ప విషయం ఒకటుంది. నేను ఎంతో ఎంతో అభిమానించే నా అభిమాన రచయిత్రి
డా. ద్వివేదుల విశాలాక్షి గారు స్వయానా ప్రేమ స్వరూప్ అత్తగారు (వాళ్ళ నాన్న గారి సోదరి).


మిత్రమా!... నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అనివుంది. నీలాంటి వారు మిత్రులు గా  వున్నందుకు గర్వ పడుతున్నాను. ఇన్నేళ్ళు నీ కోసం ఎందుకు అన్వేషించకుండా వూరుకుండి పోయానా అని బాధ పడుతున్నాను.
తొందర్లోనే కలుసుకుందాము.

ఈ పోస్ట్ రాస్తున్నప్పటి  సమయం రాత్రి ఒంటిగంటా ఇరువది ఐదు నిమిషములు.
"ఇంకా తెలవారదేమి?...ఈ చీకటి విడిపోదేమి?..." అని ఈ నిశిధిలో గొంతెత్తి గట్టిగా పాడాలని వుంది.

ప్రేమ స్వరూప్ Facebook ప్రొఫైల్ :

  


25 ఏళ్ళ క్రితం నాటి నా మాటలు లేని కార్టూను.

మాటలు  లేకుండా కేవలం బొమ్మలతోనే కార్టూన్లో అంతర్లీనంగా  వున్న వ్యంగ్యాని చూపించడం కార్టూనిస్ట్ కి నిజంగా ఓ సవాలు. బహుశా ఈ కారణం మూలంగానేమో మనం కేప్షన్ లెస్స్ కార్టూన్స్ ని పత్రికలలో చాల అరుదుగా చూస్తుంటాము.

నేను గీసిన కేప్షన్ లెస్స్ కార్టూన్స్ సంఖ్య తక్కువే ఐనా వాటిలో నాకు బాగా నచ్చింది రైల్వే ఆసుపత్రి మీద గీసిన ఈ దిగువ కార్టూన్. అప్పర్, మిడిల్ మరియు లోవేర్ బెర్త్ ల నేపధ్యం తో గీసిన కార్టూన్.  ఈ కార్టూన్  25 ఏళ్ళ క్రితం, 23 ఆగస్ట్ 1985 లో మయూరి సచిత్ర వార పత్రికలో ప్రచురించబడినది. ఇప్పుడీ పత్రిక రావడం లేదు.  


మొన్న (21-03-2011) విశాఖపట్నం లో జరిగిన మండే మొజాయిక్ "కాల రేఖలు కార్టూన్లు"  సాహిత్య సమావేశములో అధ్యక్షులు శ్రీ రామతీర్థ గారు "కాప్షన్ లెస్స్ " కార్టూన్స్ కోసం ప్రస్తావిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు.
కాప్షన్ లెస్స్ కార్టూన్స్ ని సైలెంట్ కార్టూన్స్ గా కూడా వ్యవహరిస్తారు. కాప్షన్ లెస్స్ కార్టూన్స్ పేరువింటే నాకు వెంటనే గుర్తొచ్చే కార్టూనిస్ట్ డా. ఎస్. జయదేవ్ బాబు.


శ్రీ జయదేవ్ బాబు ఎంతో అర్ధవంతంగా సామాజిక స్పృహ ప్రస్పుటించేలా  కాప్షన్ లెస్స్  కార్టూన్స్ని కుప్పలు తెప్పలుగా గీసారు. వీటికోసమని జయదేవ్ గారు ఒక వెబ్ సైటును కూడా కలిగి వున్నారు. వెబ్ సైట్ చిరునామా http://www.silentcartoon.com/ఈ సైట్ని నేనే డిజైన్ చేసి కొత్తలో ఎంతో ఉత్సాహం క్రమం తప్పకుండా అప్ డేట్స్ చేస్తూవుండేవాణ్ని. సమయం చిక్కక అప్ డేట్స్ చేసి చాల రోజులయింది. మళ్లీ మొదలు పెట్టాలి.



1986 - హస్తినపురం లో కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ బాబు


జయదేవ్ బాబు గారితో నేను మొట్టమొదట కలసినది 1986 సంవత్సరం న్యూడిల్లీ లో.
1986 సంత్సరం లో "ట్రేడ్ ఫేర్ అధారటీ ఆఫ్ ఇండియా"  న్యూడిల్లీ వారు కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ బాబు గారికి "ధూమపానం వలన కలిగే హానికరం" అన్న విషయం పై  వేసిన కార్టూన్ కి బహుమతిని ఇచ్చారు. 1983 నుండి  1987 వరకు ఉద్యోగరీత్యా న్యూడిల్లీ లో పాలమ్ ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో నివాసం వుండేవాణ్ని. ఖాళీ టైములో పత్రికలకు అక్కడనుండే కార్టూన్లూ కధలూ పంపిస్తూ వుండేవాణ్ని. అప్పట్లో "విజయ" మాసపత్రిక తో పాటే వచ్చే హాస్య పత్రికను జయదేవ్ బాబు గారే స్వయంగా పేజి కార్టూన్ల కధలతోనూ మరియు జోకులతోనీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేవారు. జయదేవ్ బాబు గారు ఎంతోమంది ఔత్సాహిక కార్టూనిస్టు ల కార్టూన్ కధల్ని హాస్య పత్రికలో ప్రచురించి ప్రోత్సాహించారు. 

"ట్రేడ్ ఫేర్ అధారటీ ఆఫ్ ఇండియా" వారు బహుమతి ప్రకటించినాక బహుమతి తీసుకోవడానికి న్యూఢిల్లీ వస్తున్నట్లు జయదేవ్ గారు నాకు వుత్తరం ద్వార తెలియజేసారు. వూరి కాని ఊరులో జయదేవ్ గార్ని పర్సనల్ గా కలుసుకునే అవకాశం ఆ విధముగా రావడం అదృష్టంగా భావించాను. ఆయన సూచన ప్రకారం  ప్రగతీ మైదాన్ లో వున్నా "ట్రేడ్ ఫేర్ అధారటీ ఆఫ్ ఇండియా" వారి కార్యాలయం కు వెళ్లి జయదేవ్ గారు ప్రెజెంటేషన్ ఫంక్షన్కు హాజరవుతున్నట్లుగా వాళ్ళ రికార్డ్స్ లో నమోదు చేయించాను.

ప్రతి ఏడాది నవంబర్ - డిసెంబర్ నెలలో ట్రేడ్ ఫేర్ అధారటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో  ట్రేడ్ ఫేర్ని ఎంతో కన్నులపండువుగా న్యూడిల్లి ప్రగతి మైదాన్లో జరుపుకుంటారు. ఎందరో ప్రముఖ కార్టూనిస్టులు కన్నులపండువుగా జరిగిన ఆనాటి ప్రెజెంటేషన్ ఫంక్షను కు హాజరయ్యారు. సతిసమేతంతో ఫంక్షన్ కు హాజరైన జయదేవ్ బాబు గారితో పాటే నేను కూడా అక్కడిచ్చిన అల్పాహారవిందును ఆరగించాను.  జీవితంలో నేను అటెండ్ ఐన మొట్టమొదటి అతి పెద్ద ఫంక్షన్ అది.

అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు కనుక జయదేవ్ గారు వున్న రెండు రోజులు న్యూడిల్లీ లో ప్రసిద్ది చెందిన "యాత్రి నివాస్ గృహం" లో బస చేసారు. దంపతులిద్దర్ని ఎర్రకోట, చాన్ధినీ చౌక్ లాంటి ప్రాంతాలకు రద్దీ గా వుండే DTC బస్సులలోనే తిప్పాను. అప్పటికి జయదేవ్ బాబు గారి వయసు ఏబది సంవత్సరాల లోపే కనుక దంపతులిద్దరూ రద్దీగా వుండే  DTC బస్సులలో ప్రయాణం చేయగలిగారు. ఫోటోలో చూస్తే మీకే తెలుస్తుంది ఆయన యెంత ఎంగ్ గా వున్నారో.

అప్పట్లో ఢిల్లీ పోలీస్ లో భాను ప్రకాష్ అనే తెలుగు సాహితీ అభిమాని కానిస్టేబుల్ పనిచేసేవారు. ఆయన శ్రీమతి I.T.O కి దగ్గర వున్న ఓ తెలుగు స్కూల్ లో టీచర్ గా వుద్యోగం చేసేవారు. ఢిల్లీ లో వున్న తెలుగు సంఘాల ద్వారా భాను ప్రకాష్ గారి కుటుంబం పరిచయమై 
న్యూడిల్లీ లో  నేను వున్నన్నాళ్ళు ఎంతో ఆప్తులుగా వున్నారు. కుతుబ్ మినార్ కు దగ్గరలో వున్న South Extension లో వున్న పోలీస్ క్వార్టర్స్ లో భాను ప్రకాష్ గారు నివాసం వుండేవారు. భాను ప్రకాష్ దంపతులు జయదేవ్ గారి దంపతుల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేసారు.


స్థలం : న్యూ డిల్లీ , ప్రగతీ మైదాన్ వెలుపల. జయదేవ్ బాబు గారికి  వెనుకన  నిల్చున్నది నేనే. నా పక్కన చేతులు కట్టుకుని నిల్చున్నతను కార్టూనిస్ట్ విజయ్ అనుకుంటా. తెలియదు జయదేవ్ గారనే అడగాలి.
ఫోటోలో ఎడమవైపు నిల్చున్నతను జయదేవ్ గారి స్నేహితులు.

మేము తీయించుకున్న ఫోటో వెనుక వైపు జయదేవ్ గారు బహుమతి పొందిన తన కార్టూన్ని గీసారు.

Me with Sri Jayadev Babu. Year 1986 - New Delhi - Qutub Minar
బహుమతి పొందిని ఈ కార్టూన్ గురించి జయదేవ్ బాబు గారు తన బ్లాగు లో కూడా వ్రాసుకున్నారు.
దయచేసి జయదేవ్ గారి బ్లాగ్ పేజీని ఈ దిగువ ఇచ్చిన లింకు లో చూడగలరు.
జయదేవ్ బాబు నో స్మోకింగ్ కార్టూన్

బాలి గారి పెన్సిల్ స్కేచ్చులు

2003 సంవత్సర కాలం లో నేను బాలి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేయడం వలన రోజులో ఎక్కువ సేపు అతని సాన్నిధ్యంలో  గడిపే అవకాశం వుండేది. 

బాలి గారు వేయవలసిన బొమ్మల లిస్టు దగ్గర పెట్టుకుని సంభందిత  కథల సారాంశం ప్రకారం ముందుగా అలవోకగా పెన్సిల్ స్కేచ్చులు గీసుకుని ఇంకింగ్ కోసం స్కేచ్చులన్ని సిద్దం చేసుకునేవారు. బాలి గారు బొమ్మలేయవలసిన కథల్ని ముందుగా నేను కూడా చదివి వుండడం వలన ఆయా కధలకు ఆయన బొమ్మలు ఎలా వేస్తారోననే కుతూహలం నాలో వుండడం మూలంగా కనురెప్పలు వాల్చకుండా అయన గీతాల్ని నిశితంగా పరిశీలించేవాణ్ని.

పరణితి చెందిన ఓ అందమైన ఆకృతి మాతృ గర్భములో వున్నప్పుడు ఎలా పొదిగి వుంటుందో అలా వుండేది  బాలి గారి పెన్సిల్ స్కేచ్చు. ఒకరోజు  బాలి గారు గీసిన  రఫ్ స్కేచ్చులన్నిటినీ జెరాక్స్ చేసి వాటిని ఇన్కింగ్ పూర్తయిపోయిన తరువాత వచ్చే బొమ్మతో పోల్చి చూడాలనే ఓ సరదా ఆలోచన వచ్చింది. కొన్ని పెన్సిల్ స్కేచ్చులను జెరాక్స్ కోసం ఇవ్వమని బాలి గారిని ప్రాధేయపడ్డాను. "పెన్సిల్ స్కేచ్చులకు జేరాక్సులు ఎందుకురా బాబు?..." అని ఆయన ప్రేమగా మందలించినా... శిష్యుని కోరిక మన్నించి, "నీ ఇష్టంరా బాబు...కానీయ్!..." అంటూ అంగీకరించారు.  

పెన్సిల్ స్కేచ్చులను జెరాక్స్ చేసినాకనే  బాలి గారు వాటిని  ఇన్కింగ్ చేసారు. ఇన్కింగ్ పూర్తైన బొమ్మల్ని కూడా జెరాక్స్ చేసి ప్రేరణ కోసం వాటన్నింటిని నా దగ్గరే భద్రపరచుకున్నాను. వాటిలో ఓ జోడీని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మిగిలినవాటిని తరువాత ఈ పోస్ట్ కి జత చేస్తాను.

పెన్సిల్ స్కేచ్చు:

ఇన్కింగ్ పూర్తైన బొమ్మ:

  
బొమ్మలు పెద్దవి గా చూసేందుకు దయచేసి బొమ్మమీద క్లిక్ చేయండి.

నా మొదటి కథ - జాతి లక్షణం

బాలజ్యోతి 1982 ఆగస్ట్ సంచికలో ప్రచురించిన నా మొట్ట మొదటి కథ ఇది. 
ఈ కథకు ముప్పై ఏళ్ళు ముంచుకు రానున్నాయి. ఇప్పటికీ నాకీ కథ కొత్తగానే వుంటుంది. పశుపక్ష్యాదుల మీద వ్రాసిన నీతి కధలు నిత్య నూతనంగా ఉంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చును. ఎప్పుడో పుట్టిన పంచతంత్రం కధలకి నానాటికి పెరుగుతున్న  ఆదరణను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. 

నా మొదటి కథ బాపు గారు వేసిన బొమ్మతో ప్రచురించడం ఓ అదృష్టం గా భావిస్తాను.
అప్పట్లో అచ్చయిన కథ కు బాలజ్యోతి వారు 75 రూపాయలు రెమ్యునరేషన్ గా ఇచ్చేవారు. 


పేజీ పెద్దదిగా చూసేందుకు దయచేసి ఇమేజ్ మీద క్లిక్ చేయగలరు.
కథని టెక్స్ట్ రూపం లో ఈ క్రిందిన చదవండి :

జాతిలక్షణం (పిట్టకథ)
ఒక అడవి లో గున్నమావి కొమ్మ పై వున్న గూటిలో ఓ కోకిలమ్మ నివాసం వుండేది. అది వసంతకాలం లో మావి చిగుళ్ళు తిని తియ్యగా పాడేది.

ఆ పక్కనే వున్న నేరేడు చెట్టుపై పాలపిట్టల గుంపోకటి అనేక గూళ్ళు కట్టుకుని ఉమ్మడి జీవనం సాగిస్తుండేవి.
పాల పిట్టల శరీరాల్ని అంటిపెట్టుకుని వున్న రంగు రంగుల ఈకల్ని చూసి కోకిలమ్మ చాల ముచ్చట పడేది. అది ఎలాగైనా వాటితో స్నేహం చేయాలని నిశ్చయించుకుంది. ఒకనాడు కోకిలమ్మ తన గూటిని వదలి, పాలపిట్టలు నివాసం వుండే నేరేడు కొమ్మ పై వాలింది. 

కారు నలుపులో వున్న కోకిలమ్మను చూడగానే తమ జాతి పక్షి కాదని గ్రహించి పాలపిట్టల గుంపు కోకిలమ్మను ముక్కు తో పొడిచి తరిమి కొట్టాయి.

కోకిలమ్మ "బ్రతుకు జీవుడా!" అనుకుంటూ వాటి బారి నుండి ఎలాగో తప్పించుకుని తన గూటిని చేరుకొని మిక్కిలి విచారించింది. ఆ రాత్రి కోకిలమ్మ కంటికి కునుకు లేదు. అది ఎలాగైనా పాలపిట్టలతో నేస్తం కట్టాలని గట్టిగా నిశ్చయించుకొంది.

బాగా ఆలోచించగా ఆలోచించగా దానికి ఓ ఉపాయం తట్టింది. అది మిగిలిన రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది.

మరుసటి దినం కోకిలమ్మ వేకువనే నిద్రలేచి గంగానది తీరానికి ప్రయాణమై, అక్కడ తన తపస్సుకు అందుబాటుగా వున్నా ఒక వృక్షంపై వాలి సరస్వతీదేవిని ప్రార్ధిస్తూ దీర్ఘమైన తపస్సు చేసింది.

దాని తపస్సుకు మెచ్చి సరస్వతిదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. 

వెంటనే కోకిలమ్మ తనకు పాలపిట్టలవంటి అందమైన ఈకల్ని ఇమ్మంది. 

అందుకు సరస్వతీదేవి అంగీకరించిందిగాని ఒకషరతు పెట్టింది. అదేమిటంటే దాని కెప్పుడైతే పాడాలని కోరిక పుడుతుందో అప్పుడు కోకిలగా మారిపోతుంది. అంతే మరెప్పటికీ పాలపిట్ట కాలేదు.

సరస్వతీదేవి అనుగ్రహంతో కోకిల పాలపిట్టగా రూపాంతరం చెంది ఆనందంతో తన నివాసం చేరుకుంది. 

పొద్దుగుంకింది. పాలపిట్టల గుంపు వచ్చే వేళకు కోకిలమ్మ నేరేడు కొమ్మలపై గెంతసాగింది. పాలపిట్టలు ఒక్కొక్కటే గూడు చేరుకుని తమ జాతి లక్షణాలు గల కోకిలమ్మను చూసి సంబరపడి తమలో చేర్చుకున్నాయి.

పాల పిట్టలతో చెలిమి కోకిలమ్మకు చాల ఆనందం కలిగించింది.ఆ స్నేహం ముక్కలై పోకుండా చిరకాలం నిలిచిపోవాలని సర్స్వతిదేవిని మనసులో మొక్కుకుంది.

ఏడాది గడిచింది.

వసంతకాలం రానే వచ్చింది.

కొత్త చిగుళ్ళు తొడిగిన వృక్షాల్ని చూడడంతో కోకిలమ్మ హృదయం పులకించింది. ఆనందంతో అది పరవశించింది. అంతే తనకు తెలియకుండానే అది గొంతెత్తి పాడసాగింది. దాంతో అది కోకిలగా మారిపోయింది. కోకిలమ్మ కారుచీకటి శరీరం చూసి పాలపిట్టల గుంపుకు ఏవగింపు పుట్టింది. అవి వాటి ముక్కులతో కోకిలమ్మను పొడిచి తమ చెట్టు నుండి దూరంగా తరిమేశాయి.

కోకిలమ్మ తన జీవితంలో ఇంకెప్పుడు పాలపిట్ట కావాలని కోరుకోలేదు. తన పాట పాడుకుంటూ  హాయిగా అడవి అంటా తిరగసాగింది. 




కధ కు బొమ్మలు

చాల ఏళ్ళ క్రితం ఓ నీతి కధ కు నేను గీసిన బొమ్మలు.